మహబూబాబాద్, వరంగల్, నవంబర్ 8, 2024: రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “తప్పు చేయని వారికి భయం లేదు, కానీ ప్రజల డబ్బును విదేశాలకు తరలించే వారిపై త్వరలోనే ఆటం బాంబులు పేలుతాయి,” అని వ్యాఖ్యానించారు. ఎవరినీ అరెస్టు చేస్తామని పేరెత్తకుండానే వక్కాణించారు.
ఫార్ములా-ఈ రేస్, డ్రగ్స్ అంశాలు:
మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ రేస్‌కి నిధులు కేటాయించిన విషయం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి, “ఆ నిధుల కేటాయింపు పద్దతిలో లోపాయికారితనం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. నిధులు కేటాయింపు ఎలాంటి పత్రాలు లేకుండా ఎలా జరిగింది?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, డ్రగ్స్ అంశంపై కేటీఆర్ ఎందుకు స్పందించడంలేదని అడిగారు.
కేటీఆర్‌పై విమర్శలు:
మంత్రులు, ముఖ్యమంత్రులు నిధుల కేటాయింపును పద్దతుల ప్రకారం నిర్వహించాల్సి ఉందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కేటీఆర్ పాదయాత్ర లేదా మోకాళ్ల యాత్ర చేసినా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. పేదవారి కష్టాలను గుర్తు చేసుకుని రుణమాఫీ చేపట్టామని, ఇది ఎన్నికల కోసం కాదని స్పష్టం చేశారు.
రైతులకు, ప్రజలకు హామీలు:
రైతులకు రూ.13 వేల కోట్ల రుణమాఫీ బకాయిలను డిసెంబర్ నాటికి చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రతి ఇంటికీ స్మార్ట్ కార్డు అందజేస్తామని, ఇది రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీతో పాటు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.