Breaking News

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు కొత్త ప్రణాళికలు: భారం పడకుండా పీపీపీ మోడల్‌పై సర్కార్ దృష్టి

హైదరాబాద్, నవంబర్ 8, 2024: మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రైవేటు-పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మూసీ నది రెండు వైపులా ఉన్న 2,000 ఎకరాలకుపైగా విలువైన భూములను పర్యాటక, వాణిజ్య, ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వినియోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ప్రాజెక్టుపై సలహా సంస్థ తాత్కాలిక డీపీఆర్‌ను (Detailed Project Report) మూడు నెలల్లో సమర్పించనుంది. మొదటి దశలో 21 కిలోమీటర్ల పొడవునా నార్సింగి నుంచి బాపూఘాట్‌ వరకు ప్రాజెక్టును అమలు చేయాలని ప్రణాళిక ఉంది. ఈ ప్రాంతంలో గోల్కొండ, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లోని రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాల భూమిని రాష్ట్రం సేకరించడానికి కృషి చేస్తోంది.

పర్యాటక ప్రాధాన్యత:
మొదటి దశలో పర్యాటక కేంద్రంగా ప్రాధాన్యం ఇస్తూ మూసీ వెంట మరో వాణిజ్య నగరాన్ని నిర్మించే ప్రతిపాదన ఉంది. ముఖ్యంగా బాపూఘాట్ వద్ద నది మధ్యలో మహాత్మా గాంధీ విగ్రహం ప్రతిష్ఠించేందుకు ఆలోచనలు కొనసాగుతున్నాయి. టిప్పుఖాన్‌ వంతెన సమీపంలో సాంస్కృతిక కేంద్రం, యాంఫీ థియేటర్ వంటి ఆకర్షణలు కూడా ప్రణాళికలో ఉన్నాయి.

రెండో దశలో శిల్పారామం, ఉద్యానవనాలు:
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రెండో దశలో నాగోల్‌ నుంచి బాచారం వరకు మరో 10 కిలోమీటర్లలో అభివృద్ధి పనులు చేయాలని ప్రణాళిక ఉంది. ఈ ప్రాంతంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే శిల్పారామం తరహా వేదికను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, మురుగుశుద్ధి కేంద్రాల (STP) దూరంలో ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: శంకర్‌పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్

మూడు దశలో సవాళ్లు:
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో ఫేజ్-3 బాగం కాస్త క్లిష్టంగా ఉండే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు 21 కిలోమీటర్లలో భూములు సేకరించడం, నిర్మాణాలు తొలగించడం వంటి చర్యల కోసం భారీ నిధులు అవసరమవుతాయి. సుమారు రూ.15 వేల కోట్ల వరకు భూముల సేకరణకు ఖర్చు అయ్యే అవకాశముంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోతే వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం ద్వారా ప్రాజెక్టును చేపట్టాలని కూడా ఆలోచనలో ఉంది. ఇందుకు తోడు, భూములను పీపీపీ మోడల్‌లో లీజుకు ఇవ్వడం ద్వారా ప్రాజెక్టు నిర్వహణ భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటకానికి కూడా సహకారం అందించడమే కాకుండా, హైదరాబాద్ నగర అభివృద్ధికి తోడ్పడగలదని అధికారులు నమ్మకంగా ఉన్నారు.