హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 9 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో సాయంత్రం రద్దీ సమయంలో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.

జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి నీటిని తొలగించే పనులు చేపట్టాయి. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు. రాబోయే రెండు రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.