అన్నంలో పురుగులు,స్నానానికి నీళ్లు లేవ

తాగునీటికీ కటకట బెంచీలపైనే నిద్రిస్తున్న విద్యార్థినులు

ఆగ్రహం వ్యక్తం చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

చౌటుప్పల్,నవంబర్01 (తొలివార్త)

చౌటుప్పల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికలవిద్యాలయం(కేజీబీవీ)లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను చూసి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదివారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మాజీ ఎమ్మెల్యేకు విద్యార్థినులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

విద్యార్థినులు చెప్పిన పురుగుల సమస్యలు

తమకు పెడుతున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని,నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.

నీటి కొరత

స్నానం చేయడానికి సరిపడా నీళ్లు లేవని,కనీసం తాగడానికి కూడా నీటి కొరత తీవ్రంగా ఉందని వాపోయారు.

వసతి కరువు

రాత్రి నిద్రించడానికి సరిపడా గదులు లేకపోవడంతో తరగతి గదుల్లోని బెంచీలపైనే నిద్రించాల్సి వస్తోందని తెలిపారు.విద్యార్థినులు వెల్లడించిన సమస్యలపై మాజీ ఎమ్మెల్యే హాస్టల్ వార్డెన్ తో మాట్లాడి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.విద్యార్థినుల ఆరోగ్యం,యోగక్షేమాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని,కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు.

స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తీరుపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా గొప్పలు చెప్పుకోవడం తప్ప,క్షేత్రస్థాయిలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు.

మూడేళ్లుగా పూర్తికాని గదుల నిర్మాణం

పాఠశాలలో విద్యార్థినుల కోసం నిర్మిస్తున్న అదనపు గదుల పనులు గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇంకా పూర్తికాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.విద్యార్థినులకు తక్షణమే నాణ్యమైన పౌష్టికాహారం,పరిశుభ్రమైన తాగునీరు,స్నానానికి సరిపడా నీటి సదుపాయం కల్పించాలని,వసతి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.