చౌటుప్పల్,అక్టోబర్09

(తొలివార్త)

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని తెలంగాణ ఉద్యమకారుడు ఉప్పు కృష్ణ విమర్శించారు.అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని,250 గజాల ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి నేటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు.కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ,చట్టబద్ధత లేని కమిటీతో సమావేశాలు అంటూ సాగదీయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.గత ప్రభుత్వం కొంతమందిని గుర్తించి కొంతమందికి ఉద్యోగాలు,కొంతమందికి రాజకీయ అవకాశాలు,మరికొంతమందికి ఆర్థిక సహాయం అందిస్తే,నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యమకారుడిని కూడా గుర్తించిన పాపాన పోలేదన్నారు.తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చాలా మంది ఉద్యమకారుల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని,ఆరోగ్యపరంగా,ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ రాష్ట్రంలో అక్కడక్కడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఉప్పు కృష్ణ డిమాండ్లు

- ఝార్ఖండ్ తరహాలో ఉద్యమకారులకు నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వాలి

- వారి ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం హెల్త్ కార్డులు ఇవ్వాలి

- ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలం తక్షణమే ఇవ్వాలి

- స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించే విధంగా రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు అందించాలి

- గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలతో పాటు ఆర్థిక సహాయం అందించాలి

- ఉద్యమంలో పాల్గొని కేసుల పాలై జైలుకు వెళ్లి ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన విద్యార్థి యువత త్యాగాలను గుర్తించాలి

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉద్యమకారులను గౌరవించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఉప్పు కృష్ణ డిమాండ్ చేశారు.