పర్మీషన్స్ లేకుండానే పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ తరగతులు

ఎంఈఓ రామారావుకు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలు

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు

నోరుమెదపని యాజమాన్యం

ఉప్పల్ అక్టోబర్ 06 (తొలివార్త )

రాష్ట్రంలో విద్యాశాఖ తీరు ‘గుడ్డి గుర్రానికి పగ్గాలు ఇచ్చినట్లు’గా తయారైంది. సక్రమంగా పనిచేసి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన యంత్రాంగం అస్తవ్యస్తంగా మారి అక్రమాలకు అడ్డాగా నిలుస్తోంది. యథా రాజా తథా ప్రజా అన్న చందంగా అధికారుల అండదండలతో ప్రైవేట్ విద్యాసంస్థలు సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నాయి. నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో ప్రైవేట్ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్న తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుని, వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది ఉప్పల్ భగాయత్‌లోని ‘శ్లోక పాఠశాల’.

ఈ పాఠశాల యాజమాన్యం ఎలాంటి సీబీఎస్‌ఈ (C.B.S.E) అనుమతులు లేకుండానే అక్రమంగా సీబీఎస్‌ఈ తరగతులను నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఫీజులు గుంజుతోంది. ప్రభుత్వం నుంచి కేవలం 7వ తరగతి వరకు మాత్రమే స్టేట్ సిలబస్ అనుమతులు పొందిన ఈ స్కూల్, అధికారుల కళ్లు గప్పి 10వ తరగతి వరకు తరగతులు నడుపుతూ దందా సాగిస్తోంది. అసలు అనుమతులే లేని తరగతుల్లో పిల్లలను చేర్చుకుంటూ, డబ్బే ప్రామాణికంగా విద్యాబోధన పేరిట తల్లిదండ్రులను, విద్యార్థులను నిలువునా మోసం చేస్తోంది.

ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అయితే స్థానిక ఉప్పల్ ఎంఈఓ రామారావు చొరవతోనే ఈ అడ్డగోలు వ్యవహారం నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుస్తున్నా ఎంఈఓ కానీ, పాఠశాల యాజమాన్యం కానీ నోరు మెదపకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనాన్ని, విద్యార్థుల జీవితాలను పణంగా పెడుతూ అక్రమ వసూళ్లకు తెగబడుతుంటే విద్యాశాఖ అధికారులు కనీసం సమీక్షించకపోవడం గమనార్హం.

వందలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతుంటే, విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కీలక శాఖలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రికి ఈ అక్రమాల బాగోతం తెలియకనా? లేక క్షేత్రస్థాయి అధికారుల చేతికందిన అమ్యామ్యాలతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారా అని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి శ్లోక పాఠశాల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన యాజమాన్యంపై, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.