వలిగొండ, అక్టోబర్ 5, తొలివార్త
యాదాద్రి భువనగిరి జిల్లా మండల ప్రజా పరిషత్ కార్యాలయం, వలిగొండలో సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి, నోడల్ అధికారి జి. జలంధర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజలు తమకు సంబంధించిన వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించిన అధికారులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి మొత్తం 3 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో, నోడల్ అధికారి జి. జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపించేందుకు ప్రతి సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు


