నందికొట్కూరు, అక్టోబర్ 04, (తొలి వార్త)
నందికొట్కూరు లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్లు వేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇష్టారాజ్యంగా అక్రమ లే అవుట్లు వేస్తున్న మామూళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పక్కన పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చాలంటే మార్కెట్ విలువకు తగ్గట్టుగా ప్రభుత్వానికి రుసుము చెల్లించాలి. ఆ రసీదుతో తహసీల్దారుకు దరఖాస్తు చేసుకుంటే ఆర్డీవో నుంచి అనుమతులు వస్తాయి. ఇవేవీ చేయకుండానే వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చి క్రయవిక్రయాలు చేస్తున్నారు.
మున్సిపల్ నిబంధనలకు తూట్లు
లేఅవుట్లు వేస్తున్న వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి చెల్లించుండా ప్లాట్లను విక్రయిస్తున్నారు. రెవెన్యూ అధికారులను సైతం లెక్క చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఆ భూమిని లే అవుట్ గా మార్పు చేసినట్లు అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలో అయితే మున్సిపల్ అధికారులు లేదా కుడా అనుమతి పొందాలి. ఇవేవీ లేకుండానే వెంచర్లు వేసి పనులు కానిచ్చేస్తున్నారు.
వ్యవసాయ భూముల్లో అక్రమ లే అవుట్లు
రియల్ ఎస్టేట్ వ్యాపాలు నందికొట్కూరు లో రూ. లక్షలతో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఎటువంటి అనుమతులు లేకుండా లే అవుట్లు వేసి అ భూమిని రూ. కోట్లుగా మారుస్తున్నారు. కనీస అనుమతులను పొందకుండానే ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు చేసుకుంటున్నారు. నందికొట్కూరు పట్టణంలోనిబ్ నాగలూటి రోడ్డులో హాస్పిటల్ వెనక, దామగట్ల, బొల్లవరం, మండ్లెం, వీపనగండ్ల గ్రామాలకు
చెందిన వ్యవసాయ భూముల్లో భారీగా లేఅవుట్లు రియల్ వ్యాపారులు వేశారు. ఆ భూ కొనుగోలు చేసిన వెంటనే ప్రైవేట్ సర్వేయర్లతో కుమ్మకై భూములన అవుట్లుగా మారుస్తున్నారు. వెంటనే వాటిని విక్రయించి సొమ్ము చేసుకొంటూ రియల్ దందా కొనసాగిస్తున్నారు.
నామమాత్రంగా అధికారుల దాడులు - మామూళ్లు ఇస్తే వెళ్లిపోతున్నట్లు ఆరోపణలు
నందికొట్కూరు పట్టణంలో అక్రమంగా వెలుస్తున్న వెంచర్లపై మున్సిపల్ అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తు, రియల్ వ్యాపారులు ఇచ్చే మామూళ్లు తీసుకొని వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముక్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ దందా కొనసాగిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ముందుగా నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత వెంచర్లలో పాతిన రాళ్లను తొలగించడం నామమాత్రంగా చేస్తూ వెళ్తున్నారు. ప్రతి వెంచర్లో అధికారులు ఒకసారైనా వేసిన రాళ్లను తొలగించాల్సిందే. ఒక సారి తొలగించి తిరిగి పాతిన రాళ్లను అధికారులు ముట్టుకున్న దాఖలాలు లేవు. దీని వెనుక ఆంతర్యం ఏమిటో మున్సిపల్ అధికారులే చెప్పాలని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


