మునుగోడు,అక్టోబర్09
(తొలివార్త) తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో,భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు.ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి,ప్రకృతితో మమేకమైన మన జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పూజించే పూల పండుగ
పూలను పూజించే అపురూపమైన సంప్రదాయం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని,తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాలు,ప్రతి కుటుంబంలో సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు.చెరువులు,ప్రకృతి వనరుల పరిరక్షణ ప్రాముఖ్యతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ మన సంస్కృతిని భావితరాలకు అందించే గొప్ప వారసత్వమని అన్నారు.మహిళలు,యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి,రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి,పాటలు పాడుతూ,ఆటలాడుతూ జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ఐక్యతకు,మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని,ప్రతి హృదయంలో ఆశలను నింపాలని,ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు




